టిట్కో ఇళ్ల మురిపం బాబుగారికి మాత్రమే…!

ధర్మచక్రం ప్రతినిధి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జరిగిన సమావేశానికి హాజరై, అక్కడ తన ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ తీసుకున్నారు. ‘ఇటు చూడు జగన్‌…ఇవి మేము నిర్మించిన ఇళ్లు…నువ్వు కట్టిన ఇండ్లు ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు. దాన్ని బాబు అనుకూల మీడియా సహజంగానే పతాక శీర్షికల్లో ప్రచురించింది. ఇదంతా చూసిన తరువాత అనిపించిందేమంటే….చంద్రబాబు నాయుడు తనను తాను మోసం చేసుకుంటున్నారని.

ఇళ్ల విషయానికే వస్తే….చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒకసారి తిరుపతికి వచ్చారు. కొందరు జర్నలిస్టు మిత్రులు ఆయన్ను కలసి ఇళ్ల స్థలాలు ఇప్పించమని అడిగారు. ‘ఇళ్ల స్థలాల మాటే ఎత్తొద్దు. స్థలాలు ఎక్కడున్నాయి. అందుకే జిG3 అపార్టుమెంట్లు కట్టిస్తున్నాం. మీకూ ఆ స్కీము కిందే ఇళ్లు కట్టిస్తాం’ అని తేల్చిచెప్పారు.

ఇది జరిగిన ఏడాదికి ఎన్నికలు జరిగాయి. వైసిపి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా భూములు గుర్తించారు. ప్రభుత్వ భూములు లేనిచోట ప్రయివేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేశారు. సిఎం ప్రకటించినట్లు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఒక్కో లేవుట్‌లో 5 వేల మందికి, పదివేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు.

‘మేము కట్టేది ఇళ్లు కాదు…ఊళ్లు’ అని జగన్‌ తరచూ చెబుతుంటారు. నిజంగా కూడా రాష్ట్రంలో చాలాచోట్ల ‘జగనన్న కాలనీ’ల పేరుతో పెద్దపెద్ద ఊర్లే నిర్మాణం అవుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం తొండవాడలో ఏకంగా ఏడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పటికే వందల మంది ఇళ్లు నిర్మించుకున్నారు. గృహ ప్రవేశాలు కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి లేఅవుట్‌లు అనేకం వున్నాయి. లక్షల ఇళ్లు నిర్మితమవుతున్నాయి.

జగనన్న కాలనీల్లో స్థలాలు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు సొంతంగా కొంత మొత్తాన్ని సమీకరించుకుని నచ్చినట్లు ఇండ్లు నిర్మించుకుంటున్నారు. జగన్‌ ప్రకటించినట్లు ఈ ఐదేళ్లలోనే 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదుగానీ…30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మాత్రం కచ్చితంగా దక్కాయి. స్థలం వచ్చాక…ఇంటి నిర్మాణం ఈ రోజు కాకుంటే రేపు నిర్మించుకుంటామన్న భరోసాతో లబ్ధిదారులున్నారు.

ఈ వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి….తాను నిర్మించిన టిట్కో ఇళ్ల వద్ద నిలబడి సెల్ఫీ తీసుకుని, తానే ఎక్కువ ఇళ్లు నిర్మించానని, జగన్‌ ఏమీ చేయలేదని చెప్పడం వల్ల ప్రయోజనం వుండదు. జగనన్న కాలనీల్లో స్థలాలు వచ్చినవారు, ఇళ్లు నిర్మించుకున్నవారు బాబు మాటలను విశ్వసించరు.

చంద్రబాబు నాయుడి హయాంలో టిట్కో ఇళ్లు నిర్మించిన మాట వాస్తవం. అయితే అందులో ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని లబ్ధిదారులకు అందజేశారనేది ప్రశ్న. చంద్రబాబు నిర్మించిన టిట్కో ఇళ్లు తీసుకున్నవారు ఇప్పడు లబోదిబోమంటున్నారు. అప్పుడు ఆ అపార్టుమెంటు ఇల్లు తీసుకోకుండావుంటే….ఇప్పుడు జగనన్న కాలనీల్లో ఇంటి స్థలం వచ్చేది కదా అని బాధపడుతున్నారు.

పేదలకు అపార్టుమెంటులో ఇల్లు ఇవ్వడం వేరు. జానెడు జాగా ఇవ్వడం వేరు. ఒకసెంటయినా స్థలంవుంటే పేదలు ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడంతో పాటు తాను మేపుకునే ఆవునో, గొర్రెనో అక్కడ కట్టేసుకుంటాడు. ఇదే అపార్టుమెంటులో సాధ్యమా? అనేది ప్రశ్న. ఈరోజుకు ఈరోజు టిట్కో ఇల్లు తీసుకున్నవారికి స్థలం ఇస్తామంటే….ఉన్నఫలంగా పేదలంతా ఆ ఇళ్లను ఖాళీచేసి స్థలం తీసుకోడానికి సిద్ధంగా వున్నారు. జగన్‌ ఇచ్చిన స్థలానికి అంత విలువ వుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా జగనన్న కాలనీల్లో స్థలాలు వచ్చాయి. ఇళ్లు నిర్మించుకుంటున్నారు.

ఈ వాస్తవాలను తాను విస్మరించడమేగాక….జగన్‌ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వడం లేదంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఈ మాటను టిడిపి శ్రేణులే విశ్వసించరంటే అతిశయోక్తి కాదు.

చంద్రబాబు ఏది చెబితే దాన్ని తన అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారాన్ని జనం నమ్మితీరుతారన్న బలమైన విశ్వాసం చంద్రబాబుది. జనాన్ని విడిచిపెట్టి మీడియాను నమ్ముకుని రాజకీయాలు చేయడం వల్లే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చతికిలపడిరది. ఆ అనుభవం తరువాత కూడా చంద్రబాబులో మార్పు కనిపించడం లేదు. వాస్తవాలను దాచిపెట్టి, అవాస్తవాలతో జనాన్ని నమ్మించాలనుకుంటే 2024 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*