స్టిక్కర్లతో లెక్కలు సరిచూస్తున్న వైసిపి.. !

జగనన్నే మా భవిష్యత్తు – పేరుతో వైసిపి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంపిలు మొదలు సాధారణ కార్యకర్తలు దాకా ఇంటింటికీ వెళ్లి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఐదు ప్రశ్నలు అడిగి, సమాధానాలు తెలుసుకుంటున్నారు. లబ్ధిదారుల ఇంటికి ‘జగనన్నే మా భవిష్యత్తు’ స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఈ స్టిక్కర్ల కార్యక్రమంపై ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అధికార వైసిపి మాత్రం ఈ కార్యక్రమాన్ని తమ ఓట్ల లెక్కలు సరిచూసుకునేందుకు చక్కగా వినియోగించుకుంటోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు అమ్మఒడి, రైతు భరోసా, ఇంటికే పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆసరా, వాహన మిత్ర ఇటువంటి అనేక సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలతో రాష్ట్రంలోని 80 శాతానికిపైగా కుటుంబాలు లబ్ధిపొందాయన్నది ప్రభుత్వ అంచనా. ఈ మేరకు రాజకీయంగా తమకు ప్రయోజనం ఒనగూరుతుందన్నది జగన్‌ ప్రగాఢ విశ్వాసం.

మొన్నటి శాసన మండలి ఎన్నికల్లో మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టిడిపి అనూహ్య విజయం సాధించింది. అప్పటి దాకా వసరు విజయాలతో దూసుకెళుతున్న వైసిపి ఓటమిపాలయింది. దీంతో ఇక వైసిపి పని అయిపోయిందని టిటిడి ప్రచారం మొదలుపెట్టింది. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృత్తమవుతాయన్న తెలుగుదేశం ప్రచారాన్ని తిప్పికొడుతున్నప్పటికీ వైసిపి లోలోన మదనపడుతోంది.

ఈ క్రమంలోనే జనంలో తమ బలం ఏమిటో లెక్కలు తేల్చుకోడానికి ‘జగనన్నే మన భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అధికార పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం పట్ల వారి అభిప్రాయం, ఆంతర్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం వల్ల ఆయా కుటుంబాలకు కలిని ప్రయోజనం ఏమిటో ఆ సందర్భంగా వివరించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి జగన్‌ ప్రభుత్వం మీద ఎంత నమ్ముకం వుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాలు ఎలా వున్నాయా? ఈ పథకాల వల్ల మీకు ప్రయోజనం చేకూరిందా? ఈ పథకాలన్నీ కొనసాగాలన్ని కోరుకుంటున్నారా? ఇందుకోసం మీరు జగన్‌కు మద్దతు ఇస్తారా? వంటి ప్రశ్నలు వేసి జనం నుంచి సమాధానాలు రాబడుతున్నారు.

ఇది వైసిపికి కచ్చితంగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఎవరు అవునన్నా కాదన్నా జగన్‌ పథకాలతో 80 శాతానికిపైగా కుటుంబాలకు మేలు జరిగిందన్నది వాస్తవం. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, డబ్బులు తెచ్చి పప్పుబెల్లాల్లా పంచేస్తున్నారని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని కూడా ఈ సందర్భంగా వైసిపి నాయకులు లబ్ధిదారుల దృష్టికి తీసుకెళుతున్నారు. 2024 ఎన్నికల్లో జగన్‌ మళ్లీ అధికారంలోకి రాకుంటే ఈ పథకాలన్నీ రద్దవుతాయన్న సందేశాన్ని నేరుగా జనంలోకి తీసుకెళుతున్నారు. దీంతో ఇప్పటిదాకా టిడిపి వైపు మొగ్గుతున్నవారు కూడా ఆలోచనలో పడుతున్నారు.

అదేవిధంగా….జగన్‌ పథకాలతో లబ్ధిపొందినవారికి వారు పొందిన ప్రయోజనాలను గుర్తు చేయడం ద్వారా జగన్‌ పట్ల విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నమూ వైసిపి నాయకులు చేస్తున్నారు. చాలామంది పేదలు, కింది మధ్యతరగతి ప్రజలు ఇష్టంగానే జగన్‌ స్టిక్కర్లను ఇళ్లకు అంటించుకుంటున్నారని వైసిపి నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీ నాయకులతో పేచీ ఎందుకనే భావనతో మొహమాటం కొద్దీ స్టిక్కర్లు అంటించుకుంటున్నది ఎవరు, మనస్ఫూర్తిగా జగన్‌ను నమ్ముతూ స్టిక్లర్లు అంటించుకుంటున్నదెవరు అనే విషయం తమకు సులభంగానే అర్థమవుతున్నదని వైసిపి ఎంఎల్‌ఏ ఒకరు చెప్పారు.

ఇదేదో ప్రచార ఆర్బాటంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తున్నదిగానీ….స్టిక్కర్ల కార్యక్రమం వల్ల టిడిపికి కోలుకోలేని దెబ్బ తిగిలేలా వుంది. అధికార పార్టీపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు పార్టీ….జనం ఖాతాల్లోకి డబ్బులు వేయడాన్ని కూడా తప్పుబడుతూ పెద్దఎత్తున ప్రచారం చేసింది. బటన్‌ నొక్కుడు పథకాలతో రాష్ట్రాన్ని జగన్‌ అప్పులపాలు చేస్తున్నారని అదేపనిగా విమర్శలు గుప్పిస్తోంది. ఆ ప్రచారాన్ని ఆసరా చేసుకుని ‘చంద్రబాబు ఇలా ప్రచారం చేస్తున్నారు….టిడిపి గెలిస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి’ అంటూ అధికార పార్టీ నేరుగా జనంలోకి తీసుకెళుతోంది. ఇది కచ్చితంగా టిడిపిని దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు.

జగనన్నే మా భవిష్యత్తు నినాదాన్ని టిడిపి ఒక ప్రచార ఆర్బాట కార్యక్రమంగా కొట్టిపారేస్తుందా….తమ పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి అప్రమత్తమవుతుందా చూడాలి.

  • ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*