
– మే 4న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహస్థాపన బుధవారం శాస్త్రోక్తంగా జరిగింది. విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బింబశుద్ధి కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలను మంత్రపూరితమైన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, రత్నన్యాసం, ధాతున్యాసం, ఆలయానికి, రాజగోపురానికి విమానకలశస్థాపన, విగ్రహస్థాపన చేపట్టారు. సాయంత్రం పూర్ణాహుతి, చతుర్దశ కలశస్నపనం, నవకలశస్నపనం, మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు, రక్షాబంధనం, శయనాధివాసం, విశేష హోమాలు నిర్వహిస్తారు.
మే 4న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం
మే 4న ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, కార్యక్రమ ప్రధాన పర్యవేక్షకులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు, ఉపద్రష్ట, టీటీడీ వైఖానస ఆగమసలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, కంకణభట్టార్ శ్రీ శేషాచార్యులు, ఎస్ ఈ లు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, విజివో శ్రీ మనోహర్, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య, శ్రీ శివప్రసాద్, ఈ ఈ శ్రీ సుధాకర్, ఏఈఓ శ్రీ రమేష్, డెప్యూటీ ఈఈ లు
శ్రీ ఆనందరావు, శ్రీ నాగరాజు, జేఈ శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న భజన, కోలాట కార్యక్రమాలు
సీతంపేటలోని ఆలయం వద్ద గల వేదికపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. గిరిజన ప్రాంతాల నుంచి భజన బృందాలు కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా ప్రచార రథం ద్వారా సీతంపేట పరిసర గ్రామాల్లో ఆలయ మహాసంప్రోక్షణ గురించి భక్తులకు తెలియజేసేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బుధవారం పణుకు పర్త గ్రామానికి చెందిన శ్రీ విఘ్నేశ్వర భజన బృందం, గరుగుబిల్లి గ్రామానికి చెందిన శ్రీ సీతారామ భక్త భజన బృందం, లుంబూరు గ్రామానికి చెందిన శ్రీ వేంకటేశ్వర భజన బృందం, లుంబూరు గ్రామానికి చెందిన శ్రీ రామలింగేశ్వర భజన బృందం, పాలకొండకు చెందిన భక్తి గీతాంజలి శ్రీ కోటదుర్గ కళాకారుల సేవా సమితి నామసంకీర్తన, చెక్కభజన చేశారు. సూపరింటెండెంట్ శ్రీ చంద్రమౌళీశ్వర శర్మ, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి లలితామణి ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Leave a Reply